నైతికత మానవ జీవితానికి పునాది వంటిదని బుద్ధుడు భావించాడు. దుఃఖవిముక్తి కోసం ఆయన సూచించిన అష్టాంగమార్గం నైతిక ఆచరణతోనే మొదలౌతుంది. నైతికతను వివరించే బుద్ధుని ఉపదేశాల్లో తరచూ కనిపించే పదం “కుశల”. [పాలిభాషలో ఇది కుసల. కాని ఈ వ్యాసంలో, తెలుగువారికి పరిచయమైన “కుశల” అనే శబ్దం వాడబడింది]. బుద్ధవచనంలో ఈ పదానికి గల వివిధ అర్థాలను, వేరువేరు సందర్భాల్లో దాన్ని ఉపయోగించిన తీరును లోతుగా పరిశీలిస్తే, బుద్ధుని బోధనల్లో ఇది చాల కీలమైన పదమని తెలుస్తుంది.  

బుద్దునికాలపు వాడుకభాషలో, ఇతర ధార్మిక సంప్రదాయాల్లో కుశల అనేది కొన్ని సాధారణ అర్థాల్లో వాడుకలో ఉంది. ఈ పదానికి గల అర్థం కాలక్రమంలో ఎలా మారుతూ వచ్చిందో క్లుప్తంగా తెలుసుకుందాం.

వైదిక సంప్రదాయ తొలి గ్రంథాలైన వేదాల్లో “కుశల” అనే పదం లేదని పరిశోధకులు చెబుతున్నారు. వేదాల తరువాత రూపొందిన బ్రాహ్మణాలు, ఉపనిషత్తుల్లో ఈ పదం కనిపిస్తుంది. ఐతరేయబ్రాహ్మణలో [1] కుశలం అనేది “సరైన” లేక “తగిన” అనే అర్థంలో కనిపిస్తుంది. శతపథ బ్రాహ్మణలో [2], చాందోగ్య ఉపనిషత్తులో [3] “అగ్నిని రగిలించటంలో నైపుణ్యం” (కుశలం అగ్నీ పరిచచారి ) అని, మంత్రాలను గానం చెయ్యటంలో “ప్రవీణుడు” (త్రయో హోద్గీతే కుశలా బభూవుహ్) అనే అర్థాల్లో ఈ పదం వాడబడింది [4]. అంటే, వైదికులు కుశల అనే పదాన్ని నైపుణ్యం, నిపుణుడు అనే అర్థాల్లో ఉపయోగించారు. అయితే, వారి దృష్టిలో నైపుణ్యం అంటే, యజ్ఞయాగాల వంటి క్రతువుల్లో మంత్రాలను యథావిధిగా వల్లించటం, వాటి ప్రకారం క్రతువును సరైన క్రమంలో నిర్వహించటం మాత్రమే.

తొలినాటి జైన, బౌద్ధ గ్రంథాలు కూడ కుశల అనే పదాన్ని నైపుణ్యం అనే అర్థంలో వాడినట్లు స్పష్టమైన ఆధారాలున్నయ్. అయితే, వాటిలో క్రతువుల ప్రస్తావన లేదు. పాలి నికాయాల్లో కుశల అనే పదం ఒక వృత్తికి సంబంధించిన ప్రావీణ్యత, చాతుర్యం, నైపుణ్యం అనే అర్థంలో చాలచోట్ల కనిపిస్తుంది. ఈ పదం నుండి రూపొందిన ‘కుశలో’ అనే శబ్దం ప్రవీణుడు, చతురుడు, నిపుణుడు లేక నేర్పరి అనే అర్థంలో వాడబడింది. ఉదాహరణకు, కుసలో వీణాయ తంతిస్సర  అంటే, వీణ వాయించటంలో నిపుణుడు అని అర్థం [5] (మరికొన్ని ఉదాహరణలు కింద చూడొచ్చు). ఇక, ఆధునిక తెలుగు సాహిత్యంలో కూడ విలువిద్యాకౌశలం, గానకౌశలం, రచనాకౌశలం వంటి పదబంధాల్లో ఈ పదం వాడుకలో ఉంది.

తనకాలంలో వాడుకలో గల మామూలు అర్థాల్లో కుశల అనే పదాన్ని వాడుతూనే, బుద్ధుడు తన ధార్మిక బోధనల్లో దీన్ని ఒక విశిష్టమైన అర్థంలో పదేపదే ఉపయోగించాడు. కనుక, ఈ పదానికి గల మామూలు అర్థాలు ఏమిటి? బుద్ధుడు దీనికి జోడించిన ప్రత్యేకమైన అర్థం ఏమిటి? ఈ ప్రత్యేక అర్థంలో అది ఎలా ఉపయోగించబడింది? అనే విషయాలను లోతుగా పరిశీలించి చూడాలి. అప్పుడు మాత్రమే మనం బుద్ధుని బోధనల్ని సరైన స్ఫూర్తిలో అర్థంచేసుకోగలం. అలాగాక, ఈ పదాన్ని సాధారణ భావంలో మాత్రమే అర్థంచేసుకుంటే, మనం బుద్ధవచనాన్ని అపార్థంచేకునే అవకాశముంది. 

కుశల: అర్థ పరిణామం

ప్రాచీనకాలంలో కుశల అనే పదానికి ఆరోగ్యం (రోగంలేని స్థితి) అనే అర్థం వాడుకలో ఉన్నట్లు పాలి వ్యాఖ్యానాలు చెప్పాయి [6]. అంటే, రోజువారి సంభాషణలో, “మీరు కుశలమేనా?” (కచ్చి ను కుసలం?) అని అడిగే ప్రశ్న, “మీరు బాగున్నారా?” లేదా “మీరు ఆరోగ్యంగా ఉన్నారా?” అనే భావాన్ని తెలియజేస్తుంది. ఈ భావంలో కుశల అనేది నేటికీ వాడుకలో ఉండటం మనకు తెలుసు. ఇక, ఈ పదం “సుఖవిపాక”,అంటే, ‘సుఖకరమైన లేక హితకరమైన ఫలితం కలిగించేది’ అనే అర్థంలో ఎక్కువగా వాడుకలో ఉన్నట్లు బౌద్ధ సంప్రదాయం చెప్పింది [7].

ఇవేగాక, తొలి బౌద్ధగ్రంథాల్లో కుశల అంటే నైపుణ్యం, నిపుణుడు వంటి అర్థాలున్నట్లు పైన చెప్పుకున్నాం. ఇందుకు రుజువుగా మరికొన్ని ఉదాహరణలు చూడండి: సమర్ధుడైన వంటవాడు [8]; రథ నిర్మాణంలో నిపుణుడు [9]; ఏనుగు సవారీలో ప్రవీణుడు [10]; నిపుణుడైన నావికుడు [11]. ఇటువంటి ఉదాహరణలు బౌద్ధగ్రంథాల్లో ఇంకా చాల ఉన్నాయి.

పై రెండు పేరాల్లో చెప్పినవి రోజువారి భాషలో కుశల అనే పదానికి గల సాధారణ అర్థాలు. మరి ఈ పదానికి బుద్ధుడు జోడించిన ప్రత్యేక అర్థం ఏమిటి? అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

బుద్ధుడు తనకాలంలో కుశల అనే పదానికి గల రెండు అర్థాలను, ధార్మిక బోధనల్లో కీలకమైనవిగా భావించాడు. వీటిలో మొదటిది, “మేలుచేసే” లేక “హితకరమైన” (పైనచెప్పిన సుఖవిపాక) అనే అర్థం. ఈ భావంలోనే, మనిషికి ఉపకారం చేసే పనిని కుశలకర్మ అని అన్నారు. దీన్ని వివరిస్తూ బుద్ధుడు, “నీకు, ఇతరులకు, ఇరువురికీ మేలు చేసేదే కుశలమైన పని” అన్నాడు.

కుశల అనే పదానికి బుద్ధుడు ఎంచుకున్న రెండవ అర్థం కౌశలం లేక నైపుణ్యం. బుద్ధుని కాలంలో ‘వృత్తికారుల శారీరక నైపుణ్యం లేక సామర్ధ్యం’ అనే అర్థంలో కుశల అనే పదం చలామణిలో ఉందని పైన చెప్పుకున్నాం. అయితే, మానవ జీవితాన్ని మనోవిజ్ఞాన దృక్పథంలో దర్శించిన బుద్ధుడు, ఈ పదాన్ని ‘శారీరక నైపుణ్యం’ అనేదానికి మారుగా, ‘మానసిక నైపుణ్యం’ (mind skill) అనే అర్థంలో ప్రయోగించాడు. బుద్ధుడు వాడిన ఈ నిర్దిష్టమైన అర్థంలో కుశల అంటే బుద్ధికుశలత. వివేచన, వివేకం, విజ్ఞత, యుక్తి, దక్షత, బుద్ధిబలం, సూక్ష్మబుద్ధి, నిశితదృష్టి, ప్రతిభ, ప్రజ్ఞ, అనేవి వివిధ స్థాయిల్లో బుద్ధికుశలతను వ్యక్తంచేసే పదాలు. ఈ భావంలోనే, “ధర్మాన్ని గ్రహించటంలో ప్రతిభ, దాన్ని ఆచరించటంలో నైపుణ్యం” గల వ్యక్తిని బౌద్ధగ్రంథాలు “ధర్మకుశలుడు” (ధమ్మానం సకుశలో) అని వర్ణించాయి [12]. దీనికి వ్యతిరేక పదం “అకుశలో”.     

పై పేరాల్లో వివరించిన “హితకరమైన”, “బుద్ధికుశలత” అనే రెండు భావాలు కలగలిసిన నూతన అర్థంలో బుద్ధుడు కుశల అనే పదాన్ని ఉపయోగించాడు. దీనిప్రకారం, మనిషి చేసే పనులు, మాట్లాడే మాటలు, ఆలోచనలు కుశలమైనవిగా పరిగణించాలంటే, వాటికి రెండు లక్షణాలు ఉండాలి: 1. ఆ పనులు మనిషికి మేలుచెయ్యాలి, కీడు చెయ్యకూడదు 2. అవి ప్రతిభతో లేక నైపుణ్యంతో కూడి ఉండాలి. వీటిలో మొదటిది ఆయా చర్యల ఉద్దేశాన్ని లేదా ఫలితాన్ని సూచిస్తుంది; రెండవది, ఆ చర్యలను అమలుచేసే ప్రక్రియను లేక పద్ధతిని సూచిస్తుంది. బుద్ధుని దృష్టిలో, మనం చేసే పనుల ఉద్దేశం ఎంత ముఖ్యమో, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చటానికి తగిన ప్రతిభతో, నైపుణ్యంతో పనిచెయ్యటం కూడ అంతే ముఖ్యం; ఈ రెండు లక్షణాల మేలుకలయికను సూచించే పదమే “కుశల”.

పైన వివరించిన ప్రత్యేక అర్థంలో కుశల అనే పదం ఇతర ధార్మిక సంప్రదాయాల్లో అసలు కనిపించదు. వైదిక సంప్రదాయం ఈ పదాన్ని ‘యజ్ఞాల నిర్వహణలో నైపుణ్యం’ అనే అర్థంలో వాడినట్లు ముందే చెప్పుకున్నాం. ఇక, బౌద్ధంతో సమాంతరంగా పుట్టిపెరిగిన జైనధర్మంలో, నైతికతను వివరించటానికి తరచూ “ధమ్మ-అధమ్మ”, “సాహు-అసాహు”, “పుణ్య-పాప” అనే పదాలను వాడటం జరిగింది [13]; కాని, వారి సాహిత్యంలో “కుశల-అకుశల” అనే పదాలు నైతిక భావంలో అసలు కనిపించవు. బహుశా ఈ కారణంగానే, బుద్ధవచనంలో కుశల అనే పదానికి గల ప్రత్యేకతను వివరిస్తూ మైఖేల్ కారిథెర్స్, “ఇది బుద్ధుడు తన సొంతం చేసుకున్న పదం” అని అన్నాడు [14]. దీన్నిబట్టి కూడ, బుద్ధవచనంలో ఈ పదానికి గల ప్రాధాన్యతను గుర్తించవచ్చు.

బుద్ధవచనంలో “కుశల”

పైన వివరించిన ప్రత్యేక అర్థంలో “కుశల” అనే పదం, బుద్ధవచనంలో ఎలా ఉపయోగించ బడిందనే విషయాన్ని, ఇప్పుడు కొన్ని ఉదాహరణలతో తెలుసుకుందాం.

బుద్ధుడు బోధించిన అష్టాంగమార్గంలో సరైనదృష్టి (సమ్మాదిట్ఠి) మొదటి అంగం. దీన్ని వివరిస్తూ, సమ్మాదిట్ఠి సుత్తంలో సారిపుత్రుడు తనతోటి భిక్షువులకు ఇలా చెప్పాడు:

“మిత్రులారా, ఒక సాధకుడు అకుశలాన్ని, అకుశల మూలాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి; అతడు కుశలాన్ని, కుశల మూలాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ విధంగా అతడు సరైనదృష్టి రుజుదృష్టి కలిగి, ధర్మంపట్ల అచంచలమైన విశ్వాసంతో సద్ధర్మాన్ని గ్రహిస్తాడు” [15].

దీనిప్రకారం, “కుశలం కానిది ఏమిటి, దాని మూలకారణం ఏమిటి? కుశలం ఏమిటి, దాని మూలకారణం ఏమిటి?” అనే విషయాలను తెలుసుకోవటం బౌద్ధంలో అత్యంత ప్రాధాన్యత గలిగిన విషయం. ఇది భిక్షువులకు మాత్రమే గాక, గృహస్తులకు కూడ వర్తిస్తుంది. ఈ విషయాన్ని వివరిస్తూ బుద్ధుడు ఇలా చెప్పాడు: “భిక్షువులారా, గృహస్తులు గాని లేదా గృహపరిత్యాగం చేసిన పరివ్రాజకులు గాని, సరైన మార్గంలో నడిచేవారిని నేను అభినందిస్తాను. గృహస్తులైనా లేక పరివ్రాజకులైనా, సరైన మార్గాన్ని అనుసరిస్తే, వారు క్రమబద్ధమైన కుశల ధర్మాన్ని గ్రహిస్తారు” [16].

పైన ఉదహరించిన రెండు సుత్తాల్లో కుశల అనే పదానికి “హితకరమైన”, “నైపుణ్యంతో కూడిన” అనే రెండు అర్థాలు సరిపోతాయి. ఇదేకోవలో, అకుశల అంటే “హానికరమైన”, “నైపుణ్యంలేని” అనే రెండు అర్థాలు వర్తిస్తాయి. అయితే, చాల సందర్భాల్లో కుశల అనేది కేవలం బుద్ధికుశలతను సూచించే అర్థంలో ఉపయోగించబడింది. ఇటువంటి సందర్భాల్లో కుసలో అనేది మనం ప్రత్యేకంగా పరిశీలించ దగిన పదం. పాలిభాషలో కుసలో (కుశలో) అంటే ప్రతిభావంతుడు, నిపుణుడు లేక సమర్ధుడు అని అర్థం. దీని బహువచనం కుసలా. బుద్ధవచనంలో ఈ పదం ఎలా వాడబడిందో చూద్దాం.

యాగాలు, అగ్నిహోత్రాల వంటి క్రతువులు నిర్వహించటం సరైన ధార్మిక నైపుణ్యం కాదని చెబుతూ, సుందరీక భారద్వాజ అనే బ్రాహ్మణునితో బుద్ధుడు ఇలా అన్నాడు: “ఓ బ్రాహ్మణా, (అగ్నిహోత్రంలో) కట్టెలు ఎగదోస్తూ, ఇటువంటి బాహ్యమైన చర్యలు (పాపం నుండి) శుద్ధి కలిగిస్తాయని అనుకోకు. దానిని బాహ్యంగా వెదికే వారికి పరిశుద్ధి లభించదని నిపుణులు చెబుతారు” [17].

ఇలా, బౌద్ధగ్రంథాల్లో కుశలో అనే పదం ‘ధార్మిక విషయాల్లో నిపుణుడు’ (expert) అనే అర్థంలో విరివిగా వాడబడింది. ఉదాహరణకు, మగ్గకుశలో అంటే మార్గంలో నిపుణుడు [18]; ఆచారకుశలో అంటే ఆచరణలో లేక ప్రవర్తనలో నైపుణ్యం కలిగినవాడు [19]. ఇక “ఏడు అంశాల్లో కుశలుడైన వ్యక్తి పరిపూర్ణుడ”ని చెప్పబడింది [20]. “సుగతుడైన భగవానుడు ధార్మిక విషయాల్లో సుకుశలుడ”ని [21], “అరహతుడు సమ్మాసంబుద్ధుడు, శారీరక వాచిక మానసిక (చర్యల) వంకలు, లోపాలు, దోషాలను గ్రహించటంలో కుశలుడ”ని చెప్పబడింది [22]. కొన్నిచోట్ల  అజ్ఞానం, అసమర్థత, అకుశలత అనేవి పర్యాపదాలుగా చెప్పబడ్డాయి [23].

ఒకానొక సందర్భంలో బుద్ధుడు, ధార్మిక మార్గాలు స్థూలంగా మూడు రకాలని చెప్పాడు. (1) మొరటు లేక ముతక మార్గం: లోకియమైన భోగాలను, సుఖాలను అనుభవించటమే జీవిత పరమార్థం అనే దృష్టితో, వాటిలో కూరుకుపోవటం. (2) దేహదండన మార్గం: ఎండవానలకు, ఆకలిదప్పులకు గురిచేసి శరీరాన్ని ఎండగట్టటం ద్వారా మోక్షం పొందాలని ప్రయత్నించటం. ఈ రెండు మార్గాలను నిరాకరించిన బుద్ధుడు, (3) మధ్యమ మార్గాన్ని ప్రతిపాదించాడు. మధ్యమ మార్గాన్ని ఆయన ఇలా వివరించాడు: “అకుశల గుణాలు ఉత్పన్నం కాకుండా ఉండటానికి, ఉత్పన్నమైన అకుశల గుణాలను వదిలించుకోటానికి, కుశల గుణాలను ఉత్పన్నం చెయ్యటానికి, ఉత్పన్నమైన కుశల గుణాలు పతనం కాకుండా పెంపొందటానికి, అవి పరిపూర్ణం కావటానికి దృఢసంకల్పంతో  సరైన ప్రయత్నం కొనసాగించాలి” [24].

మరొకచోట, “లోకం శాశ్వతమా లేక అశాశ్వతమా? లోకం సాంతమా లేక అనంతమా?…. మొదలైన అధిభౌతిక విషయాల గురించి ఆలోచించటం అకుశల చింతన, ఇందుకు మారుగా దుఃఖం, దుఃఖకారణం, దుఃఖనిరోధం, దుఃఖనిరోధం మార్గం గురించి ఆలోచించటం కుశల చింతన; ఇది శాంతికి, సంబోధికి, నిర్వాణానికి దోహదం చేస్తుంద”ని బుద్ధుడు చెప్పాడు [25].

ఇక, ధ్యానానికి ఆటంకాలైన ఐదు అవరోధాలను “అకుశలరాసి” అని, మనోవికాసానికి దోహదంచేసే నాలుగు సతిస్థానాలను “కుశలరాసి” అని చెప్పటంతో పాటు [26], తథాగతుడు లేక ధ్యానియైన అతని శిష్యుడు “లక్ష్యసాధనలో కుశలుడు, పరచిత్త కుశలుడు, పరచిత్తపరియాయ కుశలుడు” అని పాలి గ్రంథాలు చెప్పాయి [27].        

పైన ఉటంకించిన ఉదాహరణలను బట్టి, బుద్ధవచనంలో కుశల అనే పదానికి గల ప్రత్యేకమైన అర్థం ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. మూల బౌద్ధగ్రంథాల్లో ఈ పదం, ఇదే అర్థంలో అడుగడుగునా కనిపిస్తుంది. కనుక, అలాంటి సందర్భాల్లో, బుద్ధుడు వాడిన ప్రత్యేక భావంలోనే ఈ పదాన్ని మనం అర్థంచేసుకోవాలి.

కుశల-పుణ్య మీమాంస

బుద్ధుని బోధనల్లో కొన్నిచోట్ల పుణ్య, కుశల అనే పదాలు దాదాపు ఒకే అర్థంలో వాడినట్లు కనిపిస్తాయి. ఉదాహరణకు, “కుశల ధర్మాలను ఆచరిస్తే, పుణ్యం పెంపొందుతుంది” [28]. కాని, బుద్ధవచనంలో ఈ రెండు పదాలను ఉపయోగించిన సందర్భాలను లోతుగా పరిశీలిస్తే, వాటి మధ్య కచ్చితమైన అర్థభేదం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని గుర్తించకపోతే, రెండు పదాల భావం ఒకటేనని పొరబడే అవకాశముంది. కనుక, బుద్ధవచనంలో పుణ్య (పుణ్యం) అనే పదం ఏ అర్థంలో వాడబడింది? పుణ్య, కుశల అనే పదాల మధ్యగల అర్థభేదం ఏమిటి? అనే విషయాలను పరిశీలించటం అవసరం.

సాధారణంగా, పుణ్యం అంటే దానధర్మాలు, పరోపకారం వంటి మంచి పనులు చెయ్యటం ద్వారా, ఈ లోకంలో లేదా పరలోకంలో పొందగల “సుగతి” అని అర్థం. అందుకే అటువంటి పనులను పుణ్యకార్యాలు అని అన్నారు. దీనికి వ్యతిరేకంగా, “దుర్గతి”ని కలిగించే పనులను పాపకార్యాలు అన్నారు. బుద్ధునికి పూర్వం నుండి, ప్రజల్లో ఇటువంటి విశ్వాసం విస్తృతంగా ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఉదాహరణకు, గృహజీవితం వదిలి భిక్షువుగా జీవించేటందుకు అనుమతించమని అడిగిన, రట్ఠపాల అనే యువకునితో అతని తల్లిదండ్రులు ఇలా అన్నారు: 

“నాయనా రట్ఠపాలా, నువు మా ప్రియమైన ఏకైక పుత్రుడివి. నువు ఎంతో గారాబంగా సుఖంగా పెరిగావు, నీకు బాధలంటే ఏమిటో తెలియదు. నాయనా రట్ఠపాలా, నువు సపరివారంగా మందు విందు వినోదాలతో భోగసుఖాలను అనుభవిస్తూ, పుణ్యకర్మలు చేస్తూ ఆనందించవచ్చు. నువు గృహజీవితం వదిలి భిక్షువుగా  మారటానికి మేము అనుమతించం” [29].

పైన ఉటంకించిన వాక్యాలను బట్టి, సుగతి కోసం పుణ్యకార్యాలు చెయ్యటం అనేది సాధారణ ప్రజల విశ్వాసమని తెలుస్తుంది. దీనికి అనుగుణంగా, గృహస్తులతో మాట్లాడిన అనేక సందర్భాల్లో, బుద్ధుడు వారికి పాపపుణ్యాల గురించి చెప్పినట్లు తగిన ఆధారాలు బుద్ధవచనంలో కనిపిస్తాయి. ఉదాహరణకు, “పాపపుణ్యాల ఫలితాన్ని పొందుతూ, పాపం చేసినవారు దుర్గతిని, పుణ్యం చేసినవారు సుగతిని పొందుతార”ని బుద్ధుడు మహారాజు ప్రసేనజిత్తుతో చెప్పాడు [30]. అయితే, దుక్ఖనివారణ కోసం బుద్ధుడు సూచించిన మార్గంలో “పుణ్య” అనే భావనకు ఎక్కువ ప్రాధాన్యత లేదు. బుద్ధుని సొంత ఆవిష్కరణలుగా చెప్పబడుతున్న మౌలిక భావనలను వివరించే సందర్భాల్లో, తరచూ కుశల అనే భావాన్ని నొక్కిచేప్పటం జరిగింది. నిజానికి, బుద్ధుని దృష్టిలో పుణ్యం అనేది చాల అల్పమైన భావన అని తెలుస్తుంది. అదెలాగో కింద చూడండి.

ఒక సందర్భంలో, “ధ్యానాన్ని చాలించి, పుణ్య కార్యాలు చేస్తూ జీవించమ”ని చెప్పిన మారునితో బుద్ధుడు ఇలా అన్నాడు: “పుణ్యం పట్ల నాకు అణుమాత్రం అభిలాష లేదు. ఓ మారా, పుణ్యం కోరుకునే వారికి దాని గురించి చెప్పు. నాలో శ్రద్ధ, వీర్యం, ప్రజ్ఞ ఉన్నాయి” [31].   

వేరొక సందర్భంలో, సరైన దృష్టి అంటే ఏమిటో వివరిస్తూ బుద్ధుడు ఇలా అన్నాడు: “భిక్షువులారా, సరైన దృష్టి రెండు రకాలని నేను చెబుతాను: 1. (మానసిక) రుగ్మతలతో కూడిన, పుణ్యంలో భాగమైన, (పుణ్యం) పోగేసుకునే సమ్యక్ దృష్టి ఉంది; 2. రుగ్మతలులేని, లోకోత్తర మార్గంలో భాగమైన సమ్యక్ దృష్టి ఉంది” [32]. దీనిప్రకారం, సుగతిని పొందే ఉద్దేశంతో పుణ్యకార్యాలు చెయ్యాలనే దృష్టి, సమూల దుఃఖవిముక్తి పొందాలనే దృష్టి ఒకటి కావని తెలుస్తుంది. 

ధర్మమార్గంలో ఉత్తమస్థితికి చేరిన సాధకుని గురించి చెబుతూ బుద్ధుడు, “భిక్షువులారా, అవిద్యాగతుడైన వ్యక్తి పుణ్య సంకల్పం … పాప సంకల్పం తలపెడతాడు. అవిద్యను విడనాడి, జ్ఞానవంతుడైన భిక్షువు పుణ్య సంకల్పం … పాప సంకల్పం తలపెట్టడు” అని అన్నాడు [33]. అంటే, ధర్మమార్గంలో నడిచే వ్యక్తి, దుర్గతి కలిగించే పాపకర్మలను వదిలెయ్యటంతో పాటు, అంతిమంగా, భోగసుఖాలను ఆశించి చేసే పుణ్యకర్మలను కూడ త్యజించాలనేది ఈ మాటల సారాంశం.

అయితే, కుశల గుణాలను త్యజించాలనే భావన బుద్ధుని బోధనల్లో మచ్చుకు కూడ కనిపించదు. “సకల అకుశల గుణాలను త్యజించి, సకల కుశల గుణాలను పొందటం” అత్యున్నత లక్ష్యమని స్పష్టంగా చెప్పబడింది [34]; అంతేగాక, సంబోధికి దోహదంచేసే బుద్ధుని బోధనలు “అనుత్తరమైన కుశల ధర్మాలు”గా భావించబడ్డాయి [35], అంతేగాని అవి పుణ్య ధర్మాల్ని చెప్పలేదు.

 పైన చెప్పుకున్న విషయాలను బట్టి, మూల బౌద్ధగ్రంథాల్లో పుణ్య, కుశల అనే పదాలకు భిన్నమైన అర్థాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది. అయితే, తదనంతర కాలంలో రూపొందిన పాలి వ్యాఖ్యానాల్లో ఈ రెండు పదాల మధ్యగల అంతరం మసకబారి, క్రమంగా అవి పర్యాయపదాలు అనే ధోరణి ప్రబలింది. కుశల అనే పదానికి బుద్ధుడు జోడించిన ప్రత్యేక అర్థం దాదాపు కనుమరుగైనట్లు కనిపిస్తుంది [36]. ఈ విషయాన్ని లోతుగా పరిశోధించిన శ్రీలంక పండితుడు పి.డి. ప్రేమసిరి, “ఆధునిక బౌద్ధపండితులు ఈ పరిణామాన్ని గమనించనందున, ఆధునిక రచనల్లో పుణ్య, కుశల అనే పదాలను మంచి, హితకరమైన (good, wholesome) అనే ఒకే అర్థంలో అనువదించే ధోరణి బలంగా పాదుకుపోయింద”ని అన్నారు [37]. ఆధునిక పాలి అనువాద గ్రంథాల్లో, ఈ ధోరణి ప్రబలంగా కొనసాగుతున్నది.

ముగింపు: ప్రాచీనకాలంలో “కుశల” అనే పదానికి ఆరోగ్యం, శుభకరం, నైపుణ్యం అనే అర్థాలు వాడుకలో ఉన్నాయి. తనకాలంలో వాడుకలో గల సాధారణ అర్థాల్లో ఈ పదాన్ని వాడుతూనే, బుద్ధుడు, “బుద్ధికుశలత” లేక “మానసిక నైపుణ్యం” అనే విశిష్టమైన అర్థంలో ఈ పదాన్ని పదేపదే ఉపయోగించాడు. కనుక, బుద్ధుని బోధనల్లో ఇది చాల కీలమైన పదం. కుశల, పుణ్య అనే పదాల మధ్య కచ్చితమైన అర్థభేదం ఉంది. బుద్ధుని తదనంతర కాలంలో ఈ అర్థభేదం మసకబారింది; ఈ పదానికి బుద్ధుడు కల్పించిన ప్రత్యేకత మరుగునపడింది. ఈ విషయం తెలియక, ఆధునిక బౌద్ధరచనల్లో కుశల, పుణ్య అనే పదాలను ఒకే అర్థంలో అనువదించే ధోరణి ప్రబలింది. బౌద్ధాన్ని అధ్యయనం చేసేవారు, బౌద్ధరచయితలు దీన్నుండి బయటపడటం అవసరం. బుద్ధుడు జోడించిన ప్రత్యేక భావంలో “కుశల” అనే పదాన్ని అర్థంచేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం బుద్ధుని బోధనల్ని సరైన స్ఫూర్తిలో గ్రహించగలం.

రచన: డి. చంద్రశేఖర్

సూచికలు: [1] iv,vii.18 [2] XI.4.2.1 [3] 4.10.2 [4] చాందోగ్య ఉపనిషత్తు I.8.1 [5] అంగుత్తరనికాయ 6:55 [6] & [7] సుమంగళవిలాసిని, దీఘనికాయ అర్థకథ III.883 [8] సంయుత్తనికాయ 47:8 [9] మధ్యమనికాయ 58.10 [10] మ.ని. 85.55 [11] సుత్తనిపాత 323 [12] DN I.180 [13] సూత్రకృతాంగ II.5.27&28 [14] Buddha, A Very Short Introduction, Oxford [15] మ.ని.9:3 [16] సం.ని. 45:24; అం.ని. 2;40; మ.ని. 99.4 [17] సం.ని. 7:9 [18] సం.ని. 22:84 [19 ధమ్మపద 376 [20] సం.ని. 22:57. [21] దీ.ని. 9.6; మ.ని. 79.6  [22] అం.ని. 3:15 [23] సం.ని. 47:8   [24] అం.ని. 3:157 [25] సం.ని. 56:8 [26] సం.ని. 47:5 [27] అం.ని. 10:84 [28] దీ.ని.26.3 [29] మ.ని. 82.8 [30] సం.ని. 3:22 [31] సు.ని. 433, 434 [32] మ.ని. 117.6 [33] సం.ని. 12:51 [34] మ.ని. 88.17 [35] దీ.ని. 28.3 [36] సు.వి. III.883 [37] Interpretation of Two Principal Terms in Early Buddhism, an article.